అనంతపురం జిల్లా, గుంతకల్లు: గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న 33 వసతిగృహాలకు శనివారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమిపూజ నిర్వహించారు. పవిత్ర శ్రావణమాసంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు.
భక్తుల సంఖ్యకు అనుగుణంగా తగిన వసతి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు. మొత్తం 103 వసతిగృహాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఒక్కో వసతిగృహ నిర్మాణానికి రూ.12.88 లక్షలు విరాళంగా అందించే దాతలకు ఒక వసతిగృహాన్ని కేటాయించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ వసతిగృహాల నిర్మాణం పూర్తయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
శ్రావణమాసంలో స్వామివారి సన్నిధిలో వసతిగృహాలకు భూమిపూజ చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన చర్యలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పత్తి హిమబిందు, టీడీపీ మండల ఇన్‌చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, ఆలయ కమిటీ నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








