జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లాలో శనివారం ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాకు చేరుకున్న మంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్‌లో నూతనంగా మంజూరైన జగిత్యాల, మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో నిర్వహించిన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీలోని 4,520 గృహాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హత ఆధారంగానే ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన పేదలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
నూకపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీ అభివృద్ధికి తొలి దశలో రూ.32 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూములు లేకపోయినా నకిలీ పాస్ పుస్తకాల ద్వారా రైతుబంధు ప్రయోజనాలు పొందిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి అక్రమాలను ప్రక్షాళన చేస్తున్నామని, నకిలీ పాస్ పుస్తకాలను రద్దు చేసే ప్రక్రియను చేపడుతున్నామని చెప్పారు.
అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మంత్రి గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








