జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఓ రెవెన్యూ అధికారిపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కఠిన చర్యలు తీసుకున్నారు. మెట్‌పల్లి తహసీల్దార్ నీతాను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి కార్యక్రమంతో పాటు ప్రత్యేక ఓటర్ సవరణ SIR పనుల పురోగతిలో తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీంతో తహసీల్దార్ నీతాపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఇదే సమయంలో మెట్‌పల్లి తహసీల్దార్‌గా ముఫ్తార్ పాషాను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వహించాలని ఆయనను ఆదేశించారు.
భూ భారతి, ఓటరు సవరణ వంటి కీలక ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను హెచ్చరించారు. ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.








