గోదావరిఖని: గోదావరి వరదల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుందిళ్ల బ్యారేజీ నుంచి రామగుండం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రామగుండం మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరి నది పరీవాహక ప్రాంతాలు ఉండటంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మేడిపల్లి, మల్కాపురం, సప్తగిరి కాలనీ, ఉదయ్‌నగర్, రెడ్డి కాలనీ, ప్రశాంత్‌నగర్, శ్రీనగర్ కాలనీ, గంగానగర్, పవర్‌హౌస్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో పాటు భారీ వర్షాలు కురిసిన సమయంలో గోదావరి బ్రిడ్జి వద్ద నీటిమట్టం గణనీయంగా పెరుగుతుందని, దీంతో రాకపోకలు సైతం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. వరద ముంపు ప్రాంతాలను అభివృద్ధి చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారంగా కరకట్ట నిర్మిస్తామని గత పాలకులు పలుమార్లు హామీలు ఇచ్చారని గుర్తుచేశారు.
కరకట్ట నిర్మాణానికి ఒకసారి రూ.130 కోట్లు, మరోసారి రూ.200 కోట్లు, ఇంకోసారి రూ.400 కోట్లు అవసరమవుతాయని ప్రకటించడానికే పరిమితమై, ఆ తర్వాత ఆ అంశాన్ని పట్టించుకోకపోవడం ముంపు ప్రాంత ప్రజల దురదృష్టకరమని దినేష్ విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే భూసేకరణ ప్రక్రియ చేపట్టి, కరకట్ట నిర్మాణానికి సమగ్ర అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరారు. అనంతరం నిర్మాణ పనులను ప్రారంభిస్తే గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కలుగుతుందని తెలిపారు.
అదేవిధంగా కరకట్ట నిర్మాణంతో గోదావరి తీర ప్రాంతాన్ని సుందరీకరించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉంటుందని దినేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పందించి సుందిళ్ల బ్యారేజీ నుంచి రామగుండం వరకు 5 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణానికి అవసరమైన చర్యలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.








