గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న 24 గంటల నిరాహార దీక్షలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొనాలని యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
గురువారం గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించనున్న 24 గంటల నిరాహార దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను యువజన సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం గతంలో యువజన సంఘాలు చేపట్టిన ఉద్యమాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాజకీయంగా వినియోగించుకుని అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడిచినా డబుల్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమని నాయకులు అన్నారు. రోడ్డు నిర్మాణం కోసం పలుమార్లు ఎమ్మెల్యేను ప్రశ్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
ఇటీవల యువజన సంఘాలు డబుల్ రోడ్డు అంశాన్ని ప్రస్తావించగా, నిధుల మంజూరు కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని నాయకులు గుర్తు చేశారు. మాటల్లో కాకుండా చేతల్లో చిత్తశుద్ధి చూపించాలని, ఈనెల 30న యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే 24 గంటల నిరాహార దీక్షలో ఎమ్మెల్యే పాల్గొనాలని వారు సవాల్ విసిరారు.
డబుల్ రోడ్డు సమస్య కేవలం ఒక వర్గానికో, రాజకీయ పార్టీకో సంబంధించినది కాదని, మొత్తం మండల ప్రజలకు సంబంధించిన సమస్య అని నాయకులు అన్నారు. అందువల్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాజకీయాలకు అతీతంగా దీక్షకు హాజరై మద్దతు ఇవ్వాలని కోరారు. రైతులు, ఆటో యూనియన్ నాయకులు, యువతతో పాటు మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు కాల్వ నాగరాజు, ముల్కల హరీష్, మచ్చ సాయి కృష్ణ, గంట గౌతమ్, చిప్ప సంతోష్, పోలగాని రాకేష్, రంగనవేణి శ్రీనివాస్, కుంభం మహేష్ తదితరులు పాల్గొన్నారు.








