జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణంలోని బార్‌లో క్యాషియర్‌పై దాడి చేసి హత్యకు యత్నించిన రౌడీషీటర్‌ను కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని ఓ మనీబార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
బింగి అలియాస్ బంగి నగేష్ (24) బీర్ ఇవ్వాలని క్యాషియర్‌ను దుర్భాషలాడాడు. దీనిపై క్యాషియర్ ప్రశ్నించడంతో ఆగ్రహించిన నగేష్ తన చేతికి ఉన్న స్టీల్ కడియంతో అతడి ముఖంపై బలంగా దాడి చేశాడు. అనంతరం బీర్ బాటిల్‌తో తలపై కొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన బాధితుడు తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనను అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు గమనించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం నిందితుడు నగేష్‌ను కోరుట్లలో అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన స్టీల్ కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు నగేష్‌పై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, అతడిపై కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.








