నరసమాంబాపురం: మండలంలోని నరసమాంబాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీరాములవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ సీతారామచంద్ర స్వామి, దాసాంజనేయ స్వామి శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో శ్యామల కాశిరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు, గోత్రనామ మంత్రాలు పఠించి భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం గ్రామ పెద్దలు శ్యామల కాశిరెడ్డితో పాటు మండల నాయకులను స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సాని కొమ్మ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, రైతు అధ్యక్షుడు కేసరి రమణారెడ్డి, గ్రామ నాయకులు, మాజీ సర్పంచ్ పాతకోటు వెంకటరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు చాగంటి రామసుబ్బారెడ్డి, ముక్కు శీను తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, వేద మంత్రోచ్ఛారణలతో నరసమాంబాపురం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.








