జగిత్యాల: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రయోజనం కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వారి అభివృద్ధికి పూర్తిస్థాయిలో వినియోగించాలని అన్నారు.
జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, రెవెన్యూ అంశాలపై సమీక్షించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆదేశించారు.

విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తదితర శాఖల్లో ఎస్సీ, ఎస్టీల కోసం అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, అంతర్‌కుల వివాహ ప్రోత్సాహకాలు, మున్సిపల్ కార్మికులకు బీమా, 2బీహెచ్‌కే ఇళ్లు, పీఎం విశ్వకర్మ, అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలు, ఎస్సీ, ఎస్టీ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.
సమస్యల పరిష్కారం కోసం జిల్లాకు చెందిన పలువురు ప్రజలు కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రాలు అందజేశారు. వాటిపై స్పందించిన బక్కి వెంకటయ్య.. ఎస్సీ, ఎస్టీలు తమ సమస్యలతో అధికారుల వద్దకు వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారత న్యాయ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి డీఎల్‌ఎస్‌సీ సమావేశం నిర్వహించాలని, ప్రతి గ్రామంలో నెలనెలా పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారు.
భూ, రెవెన్యూ సమస్యలపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను నియామకాలు, పదోన్నతుల్లో తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. రాజగౌడ్, బి.ఎస్. లత, కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్‌తో పాటు ఆర్డీవోలు, డీఎస్పీలు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.








