వెల్దుర్తి, తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా వెల్దుర్తి–పిల్లికొట్టాల డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ పాదయాత్ర నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వెల్దుర్తి నుంచి మెదక్ కలెక్టరేట్ వరకు పాదయాత్రగా బయలుదేరారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి–పిల్లికొట్టాల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన అనంతరం మంజూరైన నిధులను రద్దు చేసి రహదారి పనులను నిలిపివేశారని ఆరోపించారు.
ప్రస్తుతం రహదారి పూర్తిగా అధ్వానంగా మారడంతో నిత్యం ప్రయాణించే ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులను తరలించే రైతులకు రహదారి పరిస్థితి పెద్ద సమస్యగా మారిందన్నారు.
ఏళ్లుగా రహదారి నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన నిధులు విడుదల చేసి డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.
పాదయాత్ర అనంతరం మెదక్ కలెక్టరేట్ చేరుకుని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి రహదారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
పాదయాత్రలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








