మార్కాపురం: పశ్చిమ ప్రకాశం ప్రజల మూడు దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారమైంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి భరోసా లభించనుంది. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల నుంచి వచ్చిన కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చి ఘనంగా స్వాగతించారు.
నల్లమల కొండల్లో నిర్మించిన రెండు సొరంగాల నుంచి కృష్ణా జలాలు గంటవానిపల్లె ఆక్విడెక్టుకు చేరుకుని అక్కడి నుంచి నల్లమల సాగర్‌కు పరుగులు తీశాయి. ఈ చారిత్రాత్మక దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వెలిగొండ తొలిదశ పూర్తితో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది. దీంతో ఏళ్ల తరబడి కరువు, నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది.
జలహారతి కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ మాగుంటతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పూల సుబ్బయ్య కలకు నిజమైన నివాళి
పశ్చిమ ప్రకాశం ప్రజలకు సాగు, తాగునీరు అందించాలన్న తమ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య చిరకాల స్వప్నం నేడు సాకారం అవుతోందని ఆయన కుమార్తెలు పూల సునందిని, పూల విలాసిని, పూల సుభాషిణి తెలిపారు.
“కరువు నేలకు కృష్ణమ్మ రావాలి” అనే ఆశయంతో పూల సుబ్బయ్య ప్రజలతో కలిసి ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేశారని వారు గుర్తుచేశారు. చట్టసభల్లోనూ ఈ ప్రాంత నీటి సమస్యలను బలంగా ప్రస్తావించారని, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కరువు, సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు.
1929 జూన్ 29న కంభంలో జన్మించిన పూల సుబ్బయ్య విద్యాభ్యాసం అనంతరం ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా పనిచేస్తూనే ప్రజా సమస్యలపై పోరాడారని కుమార్తెలు వివరించారు. 1962, 1967లో ఎర్రగొండపాలెం నుంచి, 1978లో మార్కాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల తరఫున గళం వినిపించారని చెప్పారు.
పశ్చిమ ప్రకాశానికి శాశ్వతంగా నీరు రావాలంటే కృష్ణా జలాలను తీసుకురావాలన్నదే పూల సుబ్బయ్య ప్రధాన లక్ష్యమని, ఆయన జీవించి ఉన్న సమయంలో ఆ కల నెరవేరకపోయినా వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నేడు సాకారం కావడం ఆనందంగా ఉందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుకు “పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు” గా నామకరణం చేయడం తమ కుటుంబానికి అపూర్వ గౌరవమని పేర్కొన్నారు. ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నీటి విడుదల జరగడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు.
ప్రాజెక్టును పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు కోసం కృషి చేసిన ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లు, రైతులు, ఉద్యమకారులు, నిర్వాసితులు, ప్రజలందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.
నిర్వాసితుల కన్నీటి కథకు పరిష్కారం ఎప్పుడు?
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేళ మరోవైపు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు తెరపైకి వచ్చాయి. పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన గోతం రోశమ్మ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందక తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.

తరతరాలుగా కలనూతలలో నివసిస్తూ వెలిగొండ ప్రాజెక్టు కారణంగా భూములు, ఇళ్లు కోల్పోయినప్పటికీ కొందరు అర్హుల పేర్లు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జాబితాలో లేకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అర్హులైన కొన్ని కుటుంబాలు పునరావాస, పునరావాస పరిహార ప్యాకేజీకి దూరమయ్యాయని వారు ఆరోపిస్తున్నారు.
“తల్లికి ప్యాకేజీ వస్తే కొడుకుకు రాకపోతే పరిస్థితి ఏంటి? చెల్లికి వచ్చి అక్కకు రాకపోతే పరిస్థితి ఏంటి? అర్హత ఉన్నా ‘ఆ గ్రామానికి చెందిన వారు కాదు’ అంటూ అధికారులు ప్రశ్నించడం, బెదిరించడం ఎంతవరకు సమంజసం?” అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన ప్రతి అర్హ కుటుంబాన్ని మరోసారి గుర్తించి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు నేలకు కృష్ణమ్మ చేరడం ఎంతటి చారిత్రాత్మక ఘట్టమో, అదే సమయంలో ప్రాజెక్టు కోసం తమ ఇళ్లు, భూములు త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం కూడా అంతే ముఖ్యమని గ్రామస్తులు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాలతో పశ్చిమ ప్రకాశం పచ్చబడాలంటే.. ఆ నీటి కోసం త్యాగం చేసిన నిర్వాసితుల కన్నీళ్లు కూడా తుడవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.








