జగిత్యాల జిల్లా : అటవీశాఖలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై జగిత్యాల డిప్యూటీ రేంజ్ అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ చీఫ్ కన్జర్వేటర్ అర్పణ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ఇటీవల ‘డ్యూటీ డుమ్మా కొట్టి.. ఫారెస్ట్ అధికారులు దాబాలో మందు పార్టీ’ అనే శీర్షికతో రిపోర్టర్ టీవీ లో ప్రసారమైన కథనం అటవీశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ కథనంపై స్పందించిన అటవీశాఖ ఉన్నతాధికారులు ఘటనపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
విచారణలో భాగంగా కమిటీ అధికారులు, సిబ్బంది నుంచి వివరాలను సేకరించి, అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తెలిసింది. విచారణ నివేదిక ఆధారంగా జగిత్యాల డిప్యూటీ రేంజ్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం.
అదే వ్యవహారానికి సంబంధించి మరో ఐదుగురు అటవీశాఖ అధికారులు, సిబ్బందికి కూడా శాఖాపరమైన నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసులకు వారు సమర్పించే వివరణలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలిసింది.
ఒక వార్తా కథనం వెలువడిన అనంతరం అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టడం, అనంతరం బాధ్యుడిగా గుర్తించిన అధికారిపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో అధికారులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ పరిణామం మరోసారి స్పష్టం చేస్తోంది.
ఆన్ డ్యూటీ విత్ ఫుల్ బాటిల్.. ఫారెస్ట్ అధికారుల ‘దాబా’ పార్టీ.!








