కనిగిరి: ప్రకాశం జిల్లా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కనిగిరి వైసీపీ ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తీవ్రంగా ఖండించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో 2009లో ప్రకాశం జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంతరం టీడీపీలో చేరి.. 2019లో వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ తరఫున మరోసారి ఎంపీగా గెలిచారని నారాయణ యాదవ్ గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం వైఎస్ జగన్‌పై అనుచిత పదజాలంతో విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
2019–2024 మధ్య వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జగన్ తనకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ మాగుంట చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకుని తక్కువ మెజార్టీతో గెలిచారని విమర్శించారు.
కనిగిరితో పాటు మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్లతో పోలిస్తే మాగుంటకు తక్కువ ఓట్లు వచ్చాయని నారాయణ యాదవ్ పేర్కొన్నారు. ఇంతకాలం మాగుంట సుబ్బరామిరెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానమే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి రాజకీయంగా అండగా నిలిచిందని అన్నారు.
2024 ఎన్నికల తర్వాత మాగుంట వ్యవహారశైలి, రాజకీయ వైఖరిపై ప్రజలకు స్పష్టత వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులపై ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్ కుటుంబం అండతో రాజకీయాల్లోకి వచ్చిన మాగుంట.. వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం వైఎస్ జగన్‌ను విమర్శించడం మానుకోవాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత బలమైన పోరాటాలు నిర్వహిస్తామని దద్దాల నారాయణ యాదవ్ స్పష్టం చేశారు.








