contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ముసుగులో కుల వివక్ష .. మహిళా అధికారులే టార్గెట్!

తిరుపతి జిల్లా, పాకాల: పాకాల మండలంలోని ఓ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళా అధికారిణిపై కుల వివక్ష, మానసిక వేధింపులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అధికారిణిని విధుల్లో ఇబ్బందులకు గురిచేస్తూ, కార్యాలయ కార్యకలాపాలకు సహకరించకుండా కొందరు వ్యవహరిస్తున్నారని ప్రజా, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

గతంలో ఇదే ప్రాంతంలో విధులు నిర్వహించిన ఓ మహిళా వీఆర్వో స్థానికంగా ఎదురైన వేధింపులను తట్టుకోలేక బదిలీపై వెళ్లాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మరో ఉన్నతస్థాయి మహిళా అధికారిణి విషయంలోనూ ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమకు స్థానికంగా ఉన్న పరిచయాలు, రాజకీయ అండదండలను ఉపయోగించుకుంటూ ఓ సీనియర్ అసిస్టెంట్ చాలాకాలంగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని ఓ కీలక రాజకీయ నేత అండతో అధికార వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మహిళా అధికారిణి తమపై అధికారిగా ఉండటాన్ని కొందరు జీర్ణించుకోలేక కార్యాలయ పనుల్లో సహకరించడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అధికారిణికి కార్యాలయంలో కనీస సౌకర్యాలు అందకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

అధికారిణిపై అసత్య ప్రచారాలు చేస్తూ ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజా, దళిత సంఘాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

మహిళా అధికారిణిపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆరోపణలు నిజమని తేలితే చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. బాధిత అధికారిణికి పూర్తి రక్షణ కల్పించి, ఆమె స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా, దళిత సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :