పి.సి.పల్లి, మార్కాపురం జిల్లా: విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తూ, తన సొంత నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న ఉపాధ్యాయుడు వెంకట రమణయ్యకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కేలా ప్రభుత్వం గుర్తించాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం వెంగలాయపల్లి గ్రామంలో పనిచేస్తున్న ఆయన విద్యారంగంతో పాటు యోగా, సామాజిక సేవలోనూ విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
వెంకట రమణయ్య ఇప్పటివరకు పనిచేసిన పాఠశాలల అభివృద్ధి కోసం దాదాపు రూ.20 లక్షల సొంత నిధులను ఖర్చు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా దాతల సహకారంతో సుమారు రూ.50 లక్షల వరకు నిధులు సమీకరించి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగించినట్లు వెల్లడించారు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో ‘నో అడ్మిషన్’ బోర్డు ఉండకూడదనే లక్ష్యంతో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రత్యేకంగా కృషి చేసినట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం వెంకట రమణయ్య పాఠశాలలోనే సాయంత్రం 8 గంటల వరకు ఉండి నవోదయ, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. ఆయన శిక్షణతో ఇప్పటివరకు సుమారు 30 మంది విద్యార్థులు నవోదయ, సైనిక్ స్కూల్లలో సీట్లు సాధించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులకు చదువుతో పాటు యోగా శిక్షణ అందిస్తూ వారిలో శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుతున్నారు. ఆయన శిక్షణ పొందిన సుమారు 100 మంది విద్యార్థులు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి యోగా పోటీల్లో పతకాలు సాధించినట్లు తెలిపారు.
వెంకట రమణయ్య స్వయంగా కూడా యోగా రంగంలో ప్రతిభ కనబరిచి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సుమారు 50 పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. 2026 జూన్లో విజయవాడలో నిర్వహించిన ‘యోగాంధ్ర’ పోటీల్లో మూడు పతకాలు సాధించి, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా పతకాలు అందుకున్నారని తెలిపారు.
గత 20 సంవత్సరాలుగా ఉద్యోగులు, పెద్దలు, విద్యార్థులకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా యోగా శిక్షణ అందిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ సామాజిక సేవలో ముందుండి, తన సొంత నిధులతో పాటు యోగా శిక్షకుల సహకారంతో సుమారు రూ.10 లక్షలు సమీకరించి, దాదాపు ఏడాది పాటు కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
వెంకట రమణయ్య చేసిన సేవలకు సంబంధించిన వివరాలను సుమారు 450 పేజీల ఫైల్గా రూపొందించి మార్కాపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించినట్లు తెలిపారు. అయితే ఎస్జీటీ కేటగిరీలో ఇంటర్వ్యూలు నిర్వహించే సమయంలో తమను పిలవలేదని, జిల్లాస్థాయిలో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదని ఆయన తరఫు వారు ఆరోపిస్తున్నారు. తన ఫైల్ రాష్ట్రస్థాయికి కూడా పంపలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లా నుంచి ఎస్జీటీ కేటగిరీలో రాష్ట్రస్థాయికి పంపిన ఉపాధ్యాయుల ఫైళ్లతో పాటు వెంకట రమణయ్య సమర్పించిన ఫైలును కూడా సమగ్రంగా పరిశీలించాలని కోరుతున్నారు. ఆయన అర్హతలు, విద్యారంగంలో చేసిన సేవలు, సామాజిక కార్యక్రమాలు, యోగా రంగంలో సాధించిన విజయాలను నిష్పక్షపాతంగా పరిశీలించి, అర్హత ఉన్నట్లయితే రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వెంకట రమణయ్య పేరును ప్రతిపాదించి న్యాయం చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.








