తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా: నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ సూచించారు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌ను ఆయన వార్షిక తనిఖీ నిర్వహించారు.
స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన ఆయన మొక్కలు నాటారు. స్టేషన్‌లోని జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లు, రిసెప్షన్ నిర్వహణ తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే లాకప్ గదులు, ఆయుధాగారం, భద్రతా విభాగాలను తనిఖీ చేశారు.
గ్రామాల వారీగా హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్ల కదలికలు, పెండింగ్ నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేర నియంత్రణలో భాగంగా నిరంతర నిఘా కొనసాగించాలని, రాత్రి గస్తీ, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ల తిరుగుబాట్లను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.
స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించాలని కమిషనర్ సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా వినియోగిస్తూ నాణ్యమైన చార్జ్షీట్లు దాఖలు చేయాలని తెలిపారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ప్రధాన కూడళ్లు, గ్రామాలు, కాలనీల్లో ‘నేను సైతం’ ప్రాజెక్ట్ కింద సీసీ కెమెరాల ఏర్పాటును పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని, సైబర్ నేరాల నియంత్రణకు కూడా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
ఈ వార్షిక తనిఖీలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేష్, ఎల్ఎండీ ఎస్ఐ అన్వర్ పాషా, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.








