కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్: జేకే పేపర్ మిల్లులో పనిచేస్తున్న స్థానిక కార్మికుల న్యాయమైన సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ డీసీసీ మైనార్టీ చైర్మన్ అర్షద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. మంగళవారం కార్మికులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ.. కార్మికులు తమ హక్కుల కోసం 105 రోజులుగా శాంతియుతంగా దీక్ష చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమన్నారు. పరిశ్రమలో పనిచేస్తూ కాలుష్యాన్ని భరిస్తున్న స్థానిక కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు అధిక వేతనాలు ఇస్తున్నారనే ఆరోపణలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానిక కార్మికులకు నెలకు సుమారు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు అందుతుండగా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యత్యాసాన్ని తొలగించి సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు.
అలాగే పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 80 శాతం, ఇతర ప్రాంతాల వారికి 20 శాతం ఉద్యోగాలు కల్పించే నిబంధనను అమలు చేయాలని కోరారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో జేకే పేపర్ మిల్లు యాజమాన్యం చొరవ చూపాలని సూచించారు.
కార్మికులను బెదిరిస్తూ షోకాజ్, టర్మినేషన్ నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని అర్షద్ హుస్సేన్ అన్నారు. కార్మికుల సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితర నాయకులు కలిసి కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అవసరమైతే అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడంతో పాటు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధంగా ఉండాలని అన్నారు.
కార్మికులు ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా రాజ్యాంగబద్ధంగా తమ హక్కుల కోసం పోరాడాలని అర్షద్ హుస్సేన్ సూచించారు. స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు, సమాన పనికి సమాన వేతనం కల్పించే వరకు కార్మికుల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.








