contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సింగరేణి సమస్యలపై సెప్టెంబర్ 8న గోదావరిఖనిలో సదస్సు

గోదావరిఖని : సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల సంక్షేమం, సంస్థ భవిష్యత్‌పై చర్చించేందుకు ఈ నెల 8న గోదావరిఖనిలోని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని కార్మిక నాయకులు పిలుపునిచ్చారు.

రామగుండం ఏరియాలోని జీడీకే నెం.2ఏ గని కార్మికులను కలిసి సదస్సు వివరాలను వెల్లడించిన యాదగిరి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ తెలంగాణకు తలమానికంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటాతో కొనసాగుతున్న ప్రభుత్వ రంగ సంస్థలో కార్మికుల జీతభత్యాలు, వేతన ఒప్పందాలు, సెలవులు, పదోన్నతులు, ఇతర సంక్షేమ అంశాలు దేశవ్యాప్తంగా అమలవుతున్న జేబీసీసీఐ విధానాల ప్రకారం కొనసాగుతున్నాయని తెలిపారు.

గత కొంతకాలంగా సింగరేణిలో పెరుగుతున్న రాజకీయ జోక్యం, ఆర్థిక సమస్యలు, కొత్త గనుల అభివృద్ధిలో జాప్యం, కాంట్రాక్టీకరణ వంటి పరిణామాలు సంస్థ భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని సత్తయ్య పేర్కొన్నారు. రాజకీయ జోక్యం తగ్గితే సింగరేణి ఇతర రాష్ట్రాల్లోనూ కొత్త వ్యాపార రంగాల్లోకి విస్తరించే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.

రాజకీయ జోక్యం కారణంగా కోయగూడెం-3, సత్తుపల్లి-3 వంటి కీలక బొగ్గు బ్లాకులను సింగరేణి కోల్పోయిందని ఆయన ఆరోపించారు. కొత్త బొగ్గు గనుల వేలం, కేటాయింపుల్లోనూ రాజకీయ జోక్యం వల్ల సంస్థకు కొత్త అవకాశాలు దూరమయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ సంస్థ పరిపాలనలో రాజకీయ జోక్యం కారణంగా అవినీతి పెరిగి సింగరేణి అభివృద్ధికి ఆటంకంగా మారిందని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రూ.50 వేల కోట్లకు పైగా విద్యుత్ బొగ్గు బకాయిలు రావాల్సి ఉందని సత్తయ్య తెలిపారు. అదేవిధంగా డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపైనా ఆయన పలు ఆరోపణలు చేశారు. రాజకీయ జోక్యం కారణంగా ఈ నిధుల్లోని కోట్ల రూపాయలను సింగరేణియేతర ప్రాంతాలకు మళ్లించడం వల్ల సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

ఈ అంశాలతో పాటు సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక, పరిపాలనా సమస్యలు, కొత్త గనుల అభివృద్ధి, కార్మికుల హక్కులు, కాంట్రాక్టీకరణ తదితర అంశాలపై సెప్టెంబర్ 8న జరిగే సదస్సులో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు కర్రావుల మహేష్, ఫిట్ కార్యదర్శి తాట్ల లక్ష్మయ్య, కుమ్మరి నగేష్, చీకట్ల మల్లేశం, ఆరెల్లి శ్రీకాంత్, శ్రీనివాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :