contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై నర్సాపూర్‌లో విజయోత్సవ వికాస యాత్ర

నర్సాపూర్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో విజయోత్సవ వికాస యాత్రను ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

పట్టణంలోని శ్రీ మల్లన్న గుడి వద్ద ప్రారంభమైన వికాస యాత్ర నర్సాపూర్ చౌరస్తా వరకు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ జెండాలు చేతబట్టి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ 1000 రోజుల పాలనపై విజయోత్సాహాన్ని చాటారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనమే ఈ 1000 రోజుల పాలన అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని పారదర్శకమైన, ప్రజానుకూల పాలన అందిస్తోందని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు భరోసా, పంట రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. విద్యార్థులు, యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని నాయకులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పలు రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెడుతోందని, రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, యువత అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన సునీతా రెడ్డి హయాంలో నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టడం సరికాదని అన్నారు.

కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావడానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై గొప్పలు చెప్పుకునే మాజీ మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు.

తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నాయకులు అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :