గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గుంతలు, నీటితో నిండిపోయిన రహదారిపై కాగితపు పడవలు వదులుతూ బీజేపీ నాయకులు చేపట్టిన వినూత్న నిరసన గన్నేరువరం మండల కేంద్రంలో అందరి దృష్టిని ఆకర్షించింది. గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసి, ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నీకేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఈ నిరసన చేపట్టారు.
గన్నేరువరం నుంచి గుండ్లపల్లి వైపు వెళ్లే రహదారిపై ఏర్పడిన భారీ గుంతల్లో నిలిచిన వర్షపు నీటిలో కూర్చొని బీజేపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. రహదారి పరిస్థితి అధ్వానంగా మారినా సంబంధిత అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే కాగితపు పడవలతో నిరసన చేపట్టామని తెలిపారు.
ఇదే సమస్యపై గత ఆగస్టు 10న రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని బీజేపీ నాయకులు అన్నారు. ధర్నా నిర్వహించి 30 రోజులు గడిచినా రోడ్డు సమస్యపై చర్యలు తీసుకోకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్య పరిష్కారం అయ్యే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు పనులపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మచ్చ సాయి కృష్ణ, మండల నాయకులు సందవేణి ప్రశాంత్, బండి తిరుపతి, అరికాంతం అనిల్ రెడ్డి, మునగంటి లింగయ్య, పుల్లెల జగన్, కుర్ర హరీష్, టేకు అనిల్, గూడూరి జగన్, జీల కుమార్ యాదవ్, బుర్ర రవీందర్ తదితరులు పాల్గొన్నారు.








