గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం ప్రజల చిరకాల డిమాండ్‌గా ఉన్న డబుల్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమైతే అసెంబ్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలువాల కోటి తెలిపారు.
ఈ సందర్భంగా అలువాల కోటి మాట్లాడుతూ.. గన్నేరువరం డబుల్ రోడ్డు సమస్యను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాత్రం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు.
గన్నేరువరం రహదారి పరిస్థితి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని, రాకపోకల సమయంలో ప్రమాదాల ముప్పు కూడా ఉందని ఆయన అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రహదారిని వెంటనే డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
అవసరమైతే అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వ హయాంలో రహదారి అభివృద్ధిపై జరిగిన నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తామని, ప్రజల సమస్య పరిష్కారం కోసం అసెంబ్లీలోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని అలువాల కోటి తెలిపారు.
ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా స్పందించే నాయకుడిగా కవ్వంపల్లి సత్యనారాయణకు గుర్తింపు ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గన్నేరువరం డబుల్ రోడ్డు నిర్మాణం కోసం చేపట్టే పోరాటానికి ప్రజల మద్దతు ఉంటుందని అలువాల కోటి పేర్కొన్నారు.








