గన్నేరువరం, కరీంనగర్ జిల్లా, : గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి–పొత్తూర్ డబుల్ రోడ్డు సమస్యపై స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను నిలదీశారు. మాదాపూర్ పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యను పరిష్కరించాలని కోరారు.
గుండ్లపల్లి నుంచి పొత్తూర్ వరకు రహదారిని డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు, స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రహదారి ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
“ఆనాడు పాదయాత్ర.. నేడు చేతులెత్తేశారా?”
గుండ్లపల్లి–పొత్తూర్ డబుల్ రోడ్డు కోసం గతంలో తాను పాదయాత్ర చేసిన విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేసినట్లు కార్యకర్తలు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ రహదారి అభివృద్ధిపై ప్రశ్నించగా, “నా చేతిలో ఏమీ లేదు.. మీ ఎమ్మెల్యేను అడగండి” అంటూ మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకుండా వెళ్లిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఇదే రహదారి కోసం పాదయాత్ర చేసిన మంత్రి, ఇప్పుడు సమస్య పరిష్కార బాధ్యతను ఎమ్మెల్యే వైపు చూపడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గుండ్లపల్లి–పొత్తూర్ రహదారి అభివృద్ధిపై వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.








