జగిత్యాల జిల్లా: గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్లను భాగస్వామ్యం చేస్తూ జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిమజ్జన సమయంలో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించేందుకు 17 మంది ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్లతో సమావేశం నిర్వహించిన ఎస్పీ వారికి టీ-షర్ట్‌లను అందజేశారు. అనంతరం విధుల నిర్వహణకు సంబంధించిన సూచనలు, మార్గదర్శకాలను వివరించారు.
గణేశ్ విగ్రహాలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీస్ సిబ్బందితో కలిసి ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గానికి సమాన గౌరవం, అవకాశాలు కల్పించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి బాధ్యతాయుతమైన విధుల్లో ట్రాన్స్‌జెండర్లు భాగస్వామ్యం కావడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.
గణేశ్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టిందని ఎస్పీ తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమం ద్వారా ట్రాన్స్‌జెండర్లకు సామాజికంగా మరిన్ని అవకాశాలు కల్పించాలనే సందేశాన్ని పోలీస్ శాఖ ప్రజల్లోకి తీసుకెళ్లింది.








