తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో శుక్రవారం వరి పంటపై రైతు పొలంబడి (FFS) కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం (CIPMC), వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హొన్నప్పగౌడ రైతులకు వరి పంటలో కీటకాలు, వాటి సహజ శత్రువులు (డిఫెండర్స్) గుర్తించే విధానంపై అవగాహన కల్పించారు. అలాగే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ విశ్లేషణ (AESA), కీటకాలు, తెగుళ్లను గుర్తించడం, వాటి సమగ్ర యాజమాన్య పద్ధతులపై వివరించారు.
వరి పొలాలను రైతులు క్రమం తప్పకుండా పరిశీలిస్తూ కీటకాలు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించాలని సూచించారు. కీటకాల గుర్తింపు, వ్యవసాయ సలహాల కోసం NPSS మొబైల్ యాప్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.
పర్యావరణానికి అనుకూలమైన సమగ్ర సస్యరక్షణ (IPM) పద్ధతులను పాటించడం ద్వారా రసాయనాల వినియోగాన్ని తగ్గించడంతో పాటు పంట నాణ్యతను కాపాడుకోవచ్చని, తద్వారా స్థిరమైన వరి ఉత్పత్తిని సాధించవచ్చని రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్, ఉపసర్పంచ్ స్వామి, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) మాధవి, రైతు పొలంబడి రైతులు పాల్గొన్నారు.








