- సోషల్ మీడియా ప్రచారం, ఫాలోవర్లు, వ్యూస్ పెంచుకునేందుకే కుట్ర
- వివరాలు వెల్లడించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
మెదక్–తూప్రాన్ : మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు ఏర్పాటు చేసి పోలీసులను, ప్రజలను ఆందోళనకు గురిచేసిన ఘటనలో ఇద్దరు యువకులను మెదక్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం, ఫాలోవర్లు, వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. నాగులపల్లి గ్రామానికి చెందిన బండ మధు (23), చింతకింది శ్రీధర్ (23)లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, నల్లరంగు రెయిన్‌కోట్, శాలువా, పెన్నులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 21/22వ తేదీ అర్ధరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించి, ఎర్ర వస్త్రంతో కూడిన బెదిరింపు లేఖను రిసెప్షన్ టేబుల్‌పై ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బయట మరో వ్యక్తి బైక్‌పై వేచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా మావోయిస్టుల పేరుతో ఇలాంటి లేఖను ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌తో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. సెప్టెంబర్ 16న సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా కూడా మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వెలుగులోకి రావడంతో ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కదలికలను సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ద్వారా విశ్లేషించారు. ఈ క్రమంలో నిందితుల ఆచూకీని గుర్తించిన పోలీసులు సెప్టెంబర్ 24న సాయంత్రం సుమారు 7 గంటలకు నాగులపల్లి బ్రిడ్జి వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితుడు బండ మధు సోషల్ మీడియాలో ప్రచారం పొందడంతో పాటు ఫాలోవర్లు, వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో బెదిరింపు లేఖలను ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. మేడారం ఘటనకు ఆశించిన స్థాయిలో ప్రచారం రాకపోవడంతో తూప్రాన్‌లో కూడా ఇలాంటి చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారని చెప్పారు.
పోలీసుల ప్రకారం.. మధు Gemini AI సహాయంతో బెదిరింపు లేఖను రూపొందించి, అవసరమైన మార్పులు చేసి మూడు లేఖలను సిద్ధం చేశాడు. వాటిపై ‘ALEXENDAR APTH’, ‘గణపతి అన్న’ పేర్లతో పాటు కొడవలి, సుత్తి గుర్తులను ఉంచినట్లు తెలిపారు.
సెప్టెంబర్ 21/22 అర్ధరాత్రి మధు, శ్రీధర్ బైక్‌పై తూప్రాన్‌కు చేరుకుని ముందుగా మున్సిపల్ కార్యాలయం వద్ద లేఖతో కూడిన ఎర్ర వస్త్రాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మధు మాస్క్, రెయిన్‌కోట్ ధరించి పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి లేఖను టేబుల్‌పై ఉంచడంతో పాటు తన మొబైల్ ఫోన్లో వీడియో చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఫొటోలు, వీడియోలను సన్నిహితులకు పంపినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఎస్పీ వివరించారు.
ఈ కేసు దర్యాప్తును అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ పర్యవేక్షణలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ నేతృత్వంలో ఎస్ఐ గంగరాజు, ప్రత్యేక బృందం, ఐటీ కోర్ సిబ్బంది చేపట్టారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.








