- LHMS సేవలను వినియోగించుకోవాలని పల్నాడు జిల్లా పోలీసుల సూచన
పల్నాడు : ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల భద్రత కోసం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS) సేవలను వినియోగించుకోవాలని పల్నాడు జిల్లా పోలీసులు సూచించారు. జిల్లా నూతన ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు ప్రజలకు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇంటిని ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే ముందు LHMS AP Police యాప్‌లో తమ ఇంటి వివరాలను నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. యాప్‌లో నమోదు చేసిన వివరాలను సంబంధిత పోలీస్‌స్టేషన్ సిబ్బంది పరిశీలించి, అవసరమైన మేరకు ఇంటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారు.
LHMS సేవల్లో భాగంగా పోలీస్ సిబ్బంది ఇంటి వద్దకు వెళ్లి వైర్లెస్ మోషన్ సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాను పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి ఇంటి పరిసరాలను పర్యవేక్షించేలా చర్యలు చేపడతారు.
యాప్‌లో ఇంటి చిరునామా, సెల్‌ఫోన్ నంబర్‌తో పాటు అవసరమైన ఇతర వివరాలను నమోదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. ఇంటి యజమానులు తమ గైర్హాజరీ సమయంలో ఏదైనా అనుమానాస్పద కదలికలు చోటుచేసుకుంటే పోలీసుల దృష్టికి తీసుకురావడానికి ఈ సేవ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో LHMS AP Police యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని పల్నాడు జిల్లా పోలీసులు కోరారు.
“మీ ఇంటి భద్రత… మా బాధ్యత” అంటూ ప్రజలు పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.








