గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గన్నేరువరం మండల కేంద్రంలోని పెద్ద చెరువు జలకళను సంతరించుకుంది. చెరువు పూర్తిగా నిండిపోవడంతో మత్తడి ఉప్పొంగి పొర్లుతోంది.
మత్తడి నుంచి నీరు జలపాతంలా కిందకు దూకుతుండటంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో చెరువు పరిసర ప్రాంతం సందడిగా మారింది. యువకులు మత్తడి వద్ద సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
మరోవైపు, భారీ వర్షాలతో మండలంలోని చెరువులు, కుంటలు నీటితో నిండుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే సాగునీటి సమస్యలు తగ్గడంతో పాటు రాబోయే పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మత్తడి వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు.








