తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీవాసులు గత నాలుగు రోజులుగా తీవ్ర మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానేరు డ్యామ్‌లోని నీటి మోటార్‌కు సంబంధించిన విద్యుత్ వైర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేసి తీసుకెళ్లడంతో కాలనీకి నీటి సరఫరా నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు.
నీటి సరఫరా లేకపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ అవసరాలకు కూడా నీరు అందకపోవడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో గ్రామ సర్పంచ్ ఎలుక అంజి స్వయంగా స్పందించి గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా కాలనీవాసులకు తాగునీటిని అందిస్తున్నారు.
నాలుగు రోజులుగా కొనసాగుతున్న నీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి, మోటార్‌కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. అలాగే విద్యుత్ వైర్‌ను కట్ చేసి తీసుకెళ్లిన ఘటనపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.








