మనోహరాబాద్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ పట్టణంలో 357 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తన భర్త పేరుపై ఉన్న స్థలాన్ని తనకు తెలియకుండా బంధువుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని మనోహరాబాద్‌కు చెందిన మాసనూరి లక్ష్మి ఆరోపించారు.
లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త మాసనూరి భూమయ్య 2012లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పేరుపై ఉన్న 357 గజాల ఇంటి స్థలాన్ని 2013లో అప్పటి గ్రామ కార్యదర్శి సహకారంతో తూప్రాన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తన దగ్గరి బంధువు మాసనూరి సత్తమ్మ పేరుపై గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించారని ఆమె ఆరోపించారు.
అయితే వాస్తవంగా 357 గజాల స్థలం ఉండగా, రిజిస్ట్రేషన్ పత్రాల్లో 440 గజాలుగా నమోదు చేసినట్లు లక్ష్మి పేర్కొన్నారు. అనంతరం మాసనూరి రవికుమార్ 220 గజాలను తన కుమారుడు భాస్కర్ పేరుపై, మరో 220 గజాలను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.
అదే సమయంలో పక్కనే ఉన్న ఇతరుల స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని ఆమె ఆరోపించారు. అనంతరం ఇంటి నిర్మాణం కోసం ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.15 లక్షల రుణం పొందినట్లు లక్ష్మి తెలిపారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న గ్రామ కార్యదర్శి, సబ్‌రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని, వివాదాస్పద రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించి వాటిని రద్దు చేసి తన పేరుపై స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.








