పెద్దపెల్లి జిల్లా – గోదావరిఖని : అప్పుగా ఇచ్చిన రూ.2 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనపై దాడి చేసినట్లు బేగంపేటకు చెందిన సాయిరాం రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సాయిరాం ఫిర్యాదు మేరకు.. బుధవారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో అప్పు విషయమై మాట్లాడుకుందామని తాళ్లపల్లి నరేష్ అతడిని సమీపంలోని ఇటుక బట్టీల వద్దకు పిలిచినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ అప్పు విషయమై ఇద్దరి మధ్య మాటామాటా జరిగిన అనంతరం నరేష్ కట్టేతో తనపై దాడి చేసినట్లు సాయిరాం ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ ఘటన అనంతరం సాయిరాం అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత నరేష్ కూడా సాయిరాం ఇంటి వద్దకు వచ్చి మరోసారి గొడవకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నరేష్ ఉలితో దాడి చేయడంతో తాను తీవ్రంగా గాయపడినట్లు సాయిరాం తెలిపాడు.
గాయపడిన సాయిరాంను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు కేసు నమోదు చేసి దాడికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.








