contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రీసర్వే తప్పిదాలతో రైతుల జీవితాలతో చెలగాటం .. పట్టించుకోని అధికారులు

అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలోని కేజే పురం, కోరువాడ రెవెన్యూ పరిధిలో జగనన్న రీసర్వేలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని రైతులు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు ఆరోపించారు.

ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ‘స్పందన’ కార్యక్రమంలోనూ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పీవీజీఆర్‌ఎస్ (PVGRS) రెవెన్యూ సదస్సుల్లోనూ, “ఒక మండలం – ఒక గ్రామం” కార్యక్రమం కింద పలుమార్లు అధికారులు గ్రామాలను సందర్శించినప్పటికీ రీసర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడంలో విఫలమయ్యారని విమర్శించారు. రైతులు సమర్పిస్తున్న వినతిపత్రాలు చెత్తకుప్పలో పడేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోరువాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 327/1, 327/3 లో మూడు ఎకరాల జిరాయితి పట్టా భూమిలో గత 50 ఏళ్లుగా తొమ్మిది మంది రైతులు వరి సాగు చేస్తున్నప్పటికీ, 2020లో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించిన జగనన్న రీసర్వేలో ఆ భూమిని సర్వీస్ ఇనాంగా నమోదు చేశారని తెలిపారు. అలాగే 327/4 లోని చాకలి ఇనాం భూమికి పలుకుబడి కలిగిన వ్యక్తులకు జిరాయితి పట్టాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేశారని ఆరోపించారు.

అదేవిధంగా సర్వే నంబర్లు 238, 279, 252, 278, 246/2, 246/3 లో పట్టాలు పొందిన రైతుల భూములను రీసర్వేలో గయ్యాల భూములుగా నమోదు చేయడంతో రైతులకు రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు.

కేజే పురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 189/1 నుంచి 189/20 వరకు సుమారు 20 ఏళ్ల క్రితం కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని, వారు ప్రస్తుతం మామిడి తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే 2020 రీసర్వే అనంతరం వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఈ పట్టాలు, సర్వే నంబర్లు కనిపించకుండా పోయాయని, దీనిపై పీవీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని విమర్శించారు.

ఈ సమస్యలపై సుమారు 50 మంది రైతులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కోరువాడ, కేజే పురం రెవెన్యూ కార్యదర్శులను కలెక్టర్ పిలిపించి సమస్యలపై వివరాలు అడగగా, వారు సరైన సమాధానం చెప్పలేకపోయినట్లు సమాచారం. దీంతో సంబంధిత రెవెన్యూ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, తహసీల్దార్‌కు పది రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావుతో పాటు కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కక్కల అర్జున్, కక్కల రామ, పలువురు రైతులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి రీసర్వేలో జరిగిన తప్పిదాలను సవరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :