అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా చీమలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని తాటిపర్తి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్రామంలో సుమారు 40 కుటుంబాలు నివాసం ఉంటుండగా, బోర్లు, నీటి ట్యాంకు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే తాగునీటి కోసం గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ సమస్యపై రిపోర్టర్ టీవీలో కథనం ప్రసారమవడంతో జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. సంబంధిత అధికారులు గ్రామాన్ని సందర్శించి, పనికిరాకుండా ఉన్న రెండు బోర్లను మరమ్మతులు చేయించడంతో పాటు నీటి ట్యాంకును కూడా పునరుద్ధరించారు. అనంతరం గ్రామానికి సక్రమంగా తాగునీటి సరఫరాను పునఃప్రారంభించారు.
దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో స్పందింపజేసిన రిపోర్టర్ టీవీ యాజమాన్యానికి, అలాగే వెంటనే చర్యలు చేపట్టిన అధికారులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బోయిన సుజాత మాట్లాడుతూ, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో సహకరించిన రిపోర్టర్ టీవీ యాజమాన్యానికి, స్పందించిన అధికార యంత్రాంగానికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇతర గ్రామస్తులు కూడా మీడియా చొరవతో తమ సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉందని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.








