contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మా పిల్లల చదువు కోసం పాఠశాల భవనం నిర్మించండి

రావికమతం : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొమిర గ్రామ ప్రాథమిక పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని, అంతవరకు తాత్కాలికంగా స్థలం కేటాయించి సీఏస్ఆర్ నిధులతో షెడ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కొమిర స్వర్ణ పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

కొమిర ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 68 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. పాఠశాలకు రెండు భవనాలు ఉన్నప్పటికీ, వాటిలో ఒకటి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్తులు తెలిపారు. వర్షం వస్తే పైకప్పు కారిపోవడంతో పాటు స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయని, ఇంజినీరింగ్ అధికారులు కూడా ఆ భవనాన్ని ప్రమాదకర భవనంగా గుర్తించారని పేర్కొన్నారు.

ప్రస్తుతం మిగిలిన ఒక్క భవనంలోనే 68 మంది విద్యార్థులు చదువుకోవడం సాధ్యం కాకపోవడంతో, ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు సమీపంలోని రామాలయంలో తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే వర్షాకాలంలో అక్కడ కూడా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాఠశాల భవనంలోని గోడలు చెమ్మతో తడిసి విద్యార్థుల చదువుకు అనుకూలంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో ప్రభుత్వ ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నందున, అక్కడ తాత్కాలికంగా రేకుల షెడ్ నిర్మించి తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పాఠశాల భవనం నిర్మాణానికి సంబంధించి పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా, ప్రతిపాదనలు పంపించామని మాత్రమే చెబుతున్నారని, ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి పాఠశాల భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాలని, అప్పటి వరకు సీఏస్ఆర్ నిధులతో తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైతే స్థలం కేటాయిస్తే గ్రామస్తులే చందాలు సేకరించి తాత్కాలిక షెడ్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.

ఈ ధర్నాలో గిరిజన సంఘం నాయకుడు పొలం రాజు, బి. సత్తిబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు మాట్లాడుతూ, కొమిర ప్రాథమిక పాఠశాలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి జిల్లా కలెక్టర్ సీఏస్ఆర్ నిధుల ద్వారా తాత్కాలిక రేకుల షెడ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం శాశ్వత పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :