contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీపై శిక్షణ కార్యక్రమం

అనంతపురం జిల్లా  – గుత్తి : రైతులకు ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్ (APAIMS) యాప్ వినియోగంపై గుత్తిలోని సిఎల్‌ఆర్‌సి భవనంలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గుత్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వెంకటరాముడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ఎరువుల డీలర్లు, పీఏసీఎస్ సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకటరాముడు మాట్లాడుతూ, ఇకపై రైతులకు యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రభుత్వం రూపొందించిన APAIMS యాప్ ద్వారా నిర్వహించబడుతుందని తెలిపారు. గత ఏడాది రైతులు సాగు చేసిన పంటల వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు సూచించిన మోతాదుకు అనుగుణంగా ఎరువులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

రైతులు ఎరువులు పొందాలంటే ముందుగా రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి ఆధార్ నంబర్ ద్వారా తమకు కేటాయించిన యూరియా, డీఏపీ బస్తాల వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అవసరమైన పరిమాణాన్ని నమోదు చేసిన అనంతరం సంబంధిత డీలర్ల వద్ద ఆధార్ ధృవీకరణతో ఎరువులు పొందవచ్చని తెలిపారు.

ఈ విధానం ద్వారా రాయితీపై అందించే ఎరువులు వ్యవసాయేతర అవసరాలకు మళ్లకుండా అరికట్టవచ్చని, నిజమైన రైతులకు మాత్రమే ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

అలాగే డీలర్లు రైతులకు ఎరువులు విక్రయించే సమయంలో తప్పనిసరిగా బిల్లులు జారీ చేయాలని హెచ్చరించారు. బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు జరిపినా, ప్రభుత్వ అనుమతి లేని ఎరువులను విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గుత్తి, యాడికి మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా, పెద్దవడుగూరు మండల వ్యవసాయ అధికారి మునికృష్ణ, పామిడి మండల వ్యవసాయ అధికారి విజయ్ కుమార్, సింగనమల మండల వ్యవసాయ అధికారి అన్వేష్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ అధికారులు, ఎరువుల డీలర్లు, పీఏసీఎస్ సొసైటీల సీఈఓలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :