కరీంనగర్ జిల్లా : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో బాలల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు, వారి సమస్యలపై చర్చించే వేదికగా ‘చిల్డ్రన్ పార్లమెంట్ – బాల పంచాయత్’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ ఉమెన్ సేఫ్టీ వింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో మానకొండూరు మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, బాలలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ బాలల అభివృద్ధి, మహిళల భద్రత అంశాలపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణకు, వారిలో నాయకత్వ లక్షణాల పెంపొందింపుకు ‘బాల పంచాయత్’ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. పిల్లలు తమ గ్రామం, పాఠశాల, కుటుంబం, సమాజానికి సంబంధించిన సమస్యలను స్వయంగా గుర్తించి వాటిపై చర్చించడం ద్వారా ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన పౌరసత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యం, విద్య, బాలల రక్షణ వంటి అంశాలపై పిల్లలు ధైర్యంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, మహిళలు, బాలల భద్రతకు కరీంనగర్ పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. బాలికల రక్షణ కోసం జిల్లాలో ‘స్నేహిత’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా ‘సీక్రెట్ బాక్స్’లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
విద్యార్థినులు తమకు ఎదురయ్యే వేధింపులు, సమస్యలను ఈ బాక్సుల ద్వారా రహస్యంగా తెలియజేయవచ్చని, వాటి తాళంచెవులు మహిళా కానిస్టేబుళ్ల ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. దీనివల్ల ఫిర్యాదుదారుల గోప్యతకు పూర్తి భరోసా కల్పించబడుతుందని చెప్పారు.
మహిళలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు ఎదురైనా అధైర్యపడకుండా షీ టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బాధితులు 8712670759 నంబర్‌కు కాల్ చేయడం లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
మహిళా భద్రత విభాగం డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఐపీఎస్ పిలుపు మేరకు బాలలను చైతన్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో బాల పంచాయత్‌లు కీలక పాత్ర పోషిస్తాయని సీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, ఏసీపీ విజయకుమార్, ఇన్స్పెక్టర్లు శ్రీలత, పుల్లయ్య, రమేష్, షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సభ్యులు, స్థానిక మహిళలు, బాలలు పాల్గొన్నారు.








