అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం మరో కీలక అడుగు పడింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదురుగా ఖాళీగా ఉన్న పాత పోలీస్ క్వార్టర్స్ మైదానంలో బిపిసిఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) సహకారంతో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ నిర్మాణానికి సోమవారం జిల్లా ఎస్పీ జగదీష్ భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.95 లక్షల వ్యయంతో ఈ పెట్రోల్ పంపును నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పనులకు శ్రీకారం చుట్టామని, 45 రోజులలో నిర్మాణ పనులను పూర్తి చేసి, రెండు నెలల లోపే ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ పెట్రోల్ బంక్ ద్వారా పోలీస్ సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక బలం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఇలియాజ్ భాష, డీఎస్పీలు శ్రీనివాసులు, నీలకంఠేశ్వర్ రెడ్డి, సీఐలు రామారావు, మధు, బిపిసిఎల్ సేల్స్ మేనేజర్ లక్ష్మీ, ఎస్సైలు సురేష్, అమీర్ ఖాన్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరలో పూర్తై ప్రజలకు సేవలు అందించనున్న నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








