అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయము నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం 4.0 పండుగ వాతావరణంలో నిర్వహించారు. ముందుగా విద్యాలయ ప్రాంగణాన్ని తోరణాలతో, పూలమాలలతో, రంగుల ముగ్గులతో అత్యంత సుందరంగా అలంకరించి విద్యార్థినుల తల్లిదండ్రులకు ఘనంగా ఆహ్వానం పలికారు. విద్యాలయ ప్రధానోపాధ్యాయురాలు రుద్రాక్షి ఆధ్వర్యంలో సమాజంలో బాలికలకు ఎదురయ్యే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీచింగ్ వంటి సమస్యలు తల్లిదండ్రులకు ఎల్ఈడి ద్వారా ప్రదర్శించి అవగాహన కల్పించారు . ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి మనోహర్, ఎస్ ఎం సి చైర్మన్ వి నాగరాజు, ఎస్ఎంసి వైస్ చైర్మన్ ఎన్ లక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య సమన్వయము పెంచుకొని, విద్యార్థుల చదువుపై ఆసక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేయాలన్నారు. విద్యార్థులు వ్యక్తిగత అభివృద్ధికి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. విద్యాలయ ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిసి దుస్సలవలతో సత్కరించి, భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో బోధన సిబ్బంది గౌరీ, రాఘవేంద్రమ్మ, అరుణకుమారి, నాగమణి, వీరవాణి, దాదాభి, ప్రియాంక, రామాంజునమ్మ, అరుణ, స్వాతి మరియు విద్యార్థినులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








