మంచుతో రహదారి కప్పుకుపోవడం వలన ఓ జవాన్ తన పెళ్లికి తానే వెళ్లేందుకు వీల్లేకుండా చిక్కుకుపోయిన వేళ ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. అతడి కోసం ప్రత్యేకంగా చీతా హెలికాప్టర్‌ను సిద్ధం చేసింది. ఒడిశాకు చెందిన నారాయణ బెహరా బీఎస్ఎఫ్ జవాను. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని మచిల్ సెక్టార్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. మే 2న అతడి వివాహం నిశ్చయం కాగా సెలవులు పెట్టుకున్నాడు. అయితే, నారాయణ విధులు నిర్వర్తిస్తున్న ప్రదేశం మొత్తం మంచుతో నిండిపోయింది. రహదారి మంచులో కూరుకుపోవడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లే వీలు లేకుండా పోయింది.
మరోవైపు, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన నారాయణ తండ్రి తన కుమారుడు ఎలాగైనా పెళ్లి సమయానికి వచ్చే ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను కోరారు. దీంతో వెంటనే స్పందించిన ఆర్మీ.. శ్రీనగర్‌లో ఉన్న చీతా హెలికాప్టర్‌ను ఉపయోగించి నారాయణ బెహరాను తరలించాలని ఆదేశించింది. దీంతో నిన్న ఉదయం నారాయణను హెలికాప్టర్‌లో ఎక్కించుకుని శ్రీనగర్ తీసుకొచ్చింది. అక్కడి నుంచి అతడు ఒడిశాలోని తన స్వగ్రామానికి బయలుదేరడంతో కథ సుఖాంతమైంది.