తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ బైక్, రేసర్ కూడా. తాజాగా ఆయన దుబాయ్ 24హెచ్ కార్ రేసింగ్ ఈవెంట్లో హేమాహేమీలతో పోటీ పడి మూడో స్థానంలో నిలవడం విశేషం. ప్రొఫెషనల్ డ్రైవర్లు పోటీ పడిన ఈ సర్క్యూట్ రేస్ లో ఆయన టీమ్ పోడియం ఫినిష్ అందుకోవడం హైలైట్ గా నిలిచింది. అజిత్ టీమ్ ఈ రేసులో జీటీ4 కేటగిరీలో పోటీపడింది.
రేసు ముగిసిన వెంటనే అజిత్ భారత జాతీయ పతాకం చేతబూని సర్క్యూట్ లో కలియదిరిగారు. జెండా ఊపుతూ తన ఆనందోత్సాహాలను ప్రదర్శించారు.
కాగా, అజిత్ దుబాయ్ కార్ రేసులో పతకం సాధించడంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య కూడా అజిత్ సాధించిన విజయం పట్ల స్పందించారు. “అజిత్ సార్… అదరగొట్టారు మీరు! ఏం జర్నీ, ఏం విజయం! మమ్మల్నిందరినీ గర్వించేలా చేసినందుకు మీకు శుభాభినందనలు” అంటూ ట్వీట్ చేశారు.
ఇక, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కూడా అజిత్ ఘనత పట్ల స్పందించారు. అజిత్ సాధించిన విజయం భారత్ కు గర్వకారణమని తెలిపారు. ఏ రంగంలో అడుగుపెట్టినా తన అంకితభావం, తపనతో లెక్కలేనంతమందికి అజిత్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఇదే రేసింగ్ ఈవెంట్లో కొన్ని రోజుల కింద అజిత్ కారు ప్రాక్టీస్ సెషన్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వేగంగా దూసుకొచ్చిన అజిత్ కారు… ప్రొటెక్షన్ వాల్ ను ఢీకొని గింగిరాలు తిరుగుతూ రోడ్డుపై నిలిచిపోయింది. అయితే అజిత్ కేమీ ప్రమాదం కలగలేదు. ఆయనను మరో వాహనంలో రేసింగ్ ట్రాక్ నుంచి తరలించారు.