జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వడ్డించిన బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆహార భద్రతపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు.
వివరాల్లోకి వెళితే.. మెట్‌పల్లి పట్టణానికి చెందిన కరుణాకర్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పట్టణంలోని ఆర్‌బీ (RB) రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఆయన కుమారుడు తింటున్న బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ ముక్క కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారు భయాందోళనకు గురయ్యారు.
ఈ విషయమై రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, “ఇలాంటి ఘటనలు సాధారణమే” అన్నట్లుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు ఆరోపించారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఆహారంలో ప్లాస్టిక్ వంటి ప్రమాదకర పదార్థాలు కలవడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటల్ యాజమాన్యాలు ఆహార నాణ్యత, పరిశుభ్రత, తయారీ విధానాల్లో మరింత జాగ్రత్త వహించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇటీవలి కాలంలో మెట్‌పల్లి పట్టణంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. సంబంధిత ఆహార భద్రత శాఖ అధికారులు వెంటనే స్పందించి రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








