contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైసీపీ పార్టీ మళ్లీ వస్తే అంధకారమే: పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ప్రత్యామ్నాయ పాలన అవసరం అని స్పష్టం చేశారు.

అయితే, రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని అన్నారు. పొత్తు గురించి చెబుతూ, పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, పొత్తులను వ్యక్తిగత లాభాల కోణంలో చూడడంలేదని స్పష్టం చేశారు. 2014లో బీజేపీ, టీడీపీలతో కలిసి జనసేన పోటీ చేసిందని వెల్లడించారు. ఎప్పుడైనా సరే, పొత్తు ప్రజలకు ఉపయోగపడకపోతే జనసేన అందులోంచి బయటికి వస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత క్షీణించాయని, ఆడబిడ్డల గౌరవ మర్యాదలు కాపాడమంటే అది చాలా చిన్న విషయంగా మాట్లాడతారని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ పెద్దలపై ధ్వజమెత్తారు. బిడ్డలు చేసిన తప్పులకు తల్లులే కారణమంటూ మాట్లాడడం వంటి విపరీత ధోరణులు అందరికీ బాధ కలిగించాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బలమైన ప్రత్యామ్నాయం కావాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో అన్ని పార్టీలు ఏకమై కాంగ్రెస్ కు ఎదురొడ్డి నిలిచాయని పవన్ వివరించారు.

ఈ నేపథ్యంలో, అస్తవ్యస్తంగా ఉన్న వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలంటే ఓటు చీలకూడదని, దీనిపై ఒక చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. కేంద్రం పెద్దలు కచ్చితంగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :