కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) భరోసాగా నిలుస్తోంది. ఇందులో భాగంగా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను స్థానిక నాయకులు పంపిణీ చేశారు.
సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రత్యేక చొరవ, ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందిన అనంతరం ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరైన బాధితులకు ఈ ఆర్థిక సహాయం అందజేశారు.
ఎమ్మెల్యే సూచనలతో మాజీ కౌన్సిలర్ బాల్క శ్యామ్ కుమార్, నాయకులు ప్రిన్స్ వర్గీస్, వెంకటేష్ స్థానిక కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను నేరుగా అందించారు.
ఈ సందర్భంగా బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, “ఆపత్కాలంలో వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సాయం మాకు ఎంతో ఊరటనిచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లులు త్వరగా మంజూరయ్యేలా సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారికి, చెక్కులను పంపిణీ చేసిన స్థానిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు” అని కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కల్పిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.








