కరీంనగర్ జిల్లా: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీ) కింద 17.14 కోట్ల రూపాయల అంచనాలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్ లకు ప్రతిపాదనలు అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు. మానకొండూర్ మండలానికి 3.02 కోట్ల రూపాయలు, శంకరపట్నం మండలానికి 3 కోట్లు, తిమ్మాపూర్ మండలానికి మూడు కోట్లు, గన్నేరువరం మండలానికి 2.21 కోట్లు, బెజ్జంకి మండలానికి 2.87 కోట్లు, ఇల్లంతకుంట మండలానికి 3.04 కోట్ల రూపాయల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినట్టు ఎమ్మెల్యే వివరించారు. పాలనాపరమైన అనుమతులు మంజూరు కాగానే ఆయా మండలాల్లో పనులను వచ్చే వారంలో చేపడతామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీలలో పంచాయతీ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, ప్రహరీ గోడల నిర్మాణం చేపడతామన్నారు. అంతేకాకుండా రవాణా సౌకర్యాలు మెరుగుపర్చడం కోసం గ్రామాల్లో అంతర్గతంగా సీసీ రోడ్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు.