- ఇళ్లలోకి చేరిన నీరు
- తడిసి ముద్దయిన సరుకులు
- హుటాహుటిన సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
- వాడవాడ సందర్శన
- బాధితుల ఇళ్ల పరిశీలన
- పరిహారం, నిత్యవసర సరుకుల అందజేతకు హామీ
కరీంనగర్ జిల్లా: తోటపల్లి రిజర్వాయర్ లింక్ కెనాల్ డి-4 కాలువకు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామం వద్ద ఆదివారం ఉదయం గండిపడడంతో ఆ గ్రామం జలమయమైంది. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఇంట్లోనే వస్తువులు తడిసి ముద్దయ్యాయి. అలాగే కొన్ని వస్తువులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. విషయం తెలుసుకున్న మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ హుటాహుటిన ఆ గ్రామాన్ని సందర్శించారు. కాలువకు గండిపడ్డ ప్రదేశాన్ని పరిశీలించారు. అందుకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. పలు ఇళ్లకు వెళ్లి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాలువకు గండి వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రస్తుతం గండిపడ్డ ప్రదేశంలోనే గతంలో కూడా రెండు పర్యాయాలు గండ్లు పడ్డాయని, ఇకముందు ఎలాంటి విపత్తు సంభవించకుండా ఉండేందుకు శాశ్వత నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. ఒక్కసారిగా నీరు వచ్చి ఇళ్లలోకి చేరడం వల్ల ప్రజలు అయోమయానికి గురి అయ్యారని, ఇళ్లల్లో వస్తువులు,ధాన్యం, ఆహార సరుకులు పూర్తిగా తడిచిపోయాయన్నారు. కొంతమేరకు ఆస్తి నష్టం కూడా జరిగిందని ఆయన చెప్పారు. బాధితులకు పరిహారంతో పాటు నిత్యవసర సరుకులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయమే ఇప్పటికే రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు సత్యనారాయణ వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు తూముల శ్రీనివాస్,పోతుగంటి శ్రీనివాస్, పొట్ట శ్రీనివాస్,బుర్ర కనకయ్య, రావుల కృష్ణ, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, పి కిషన్, సంపత్ నాంపల్లి ఆంజనేయులు, జి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.