contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సంక్షేమ వసతి గృహాలకు కొత్త రూపు – కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాలు

కరీంనగర్ జిల్లా: సంక్షేమ వసతి గృహాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమవారం ఈ దిశగా మంచి అవకాశమని ఆమె పేర్కొన్నారు.

సోమవారం రాత్రి కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు, రీజినల్ కోఆర్డినేటర్లు మరియు ఇతర సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టళ్ల పనితీరు, సమస్యలు, అభివృద్ధి చర్యలపై సమగ్రంగా చర్చించారు.

కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలకు కొత్త రూపురేఖలు తీసుకురావాలని, ప్రతి హాస్టల్‌లో సంక్షేమవారం కార్యక్రమాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు వంటి అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు.

బాలికల హాస్టళ్లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని, సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైతే వెంటనే కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై దృష్టి పెట్టి, మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

హాస్టళ్లలో శానిటేషన్, విద్యుత్ భద్రత, వసతి గదుల మరమ్మతులు, లీకేజీలు, టాయిలెట్ల సౌకర్యాలు వంటి అంశాలపై నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. విద్యార్థులకు దోమల బెడద లేకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

వార్డెన్లు, సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మండల స్థాయిలో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని చెప్పారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పోషకాహారం అందేలా మెనూ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కిచెన్, స్టోర్‌రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచాలని, కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించవద్దని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

విద్యార్థుల అభివృద్ధికి వసతి గృహాలు కీలకమని, వాటిని అన్ని విధాలుగా సమస్యలేని విధంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సోషల్ వెల్ఫేర్ ఇంచార్జ్ తిరుపతి రావు, డిపిఓ జగదీశ్వర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :