హైదరాబాద్ నగరంలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి తీవ్ర ఎండలు కాస్తుండగా, మధ్యాహ్నం తర్వాత నగరమంతా ఆకాశం మేఘావృతమైంది. అనంతరం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
తీవ్ర గాలుల ధాటికి చింతల్, పద్మనగర్ ప్రాంతాల్లో ఒక భారీ చెట్టు వేర్లతో సహా కూలిపోయింది. దీంతో సమీపంలోని రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ ఘటనలో కొన్ని ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం.
కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, సికింద్రాబాద్, జీడిమెట్ల, కొంపల్లి, దుండిగల్, నిజాంపేట, బాలానగర్ సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో వడగండ్ల వాన ప్రభావం తీవ్రంగా కనిపించింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉండగా, రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్లో భారీ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అలాగే మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్ సహా మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు లేకుండా బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు.








