కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సతీష్ రెడ్డికి ప్రభుత్వం మంజూరు చేసిన త్రీ వీలర్ స్కూటీని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం అందజేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ప్రజా భవన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందజేస్తోందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
స్కూటీ అందుకున్న సతీష్ రెడ్డి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వాహనం ద్వారా తన దైనందిన పనులు సులభతరం అవుతాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, పార్టీ నాయకులు అంజిరెడ్డి, ఎర్రోళ్ల రాజయ్య, ఎల్లారెడ్డి, చింతలపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.








