కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తిరు ఆర్యన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవ అనంతరం ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే హరీష్ బాబు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య సదుపాయాలను పరిశీలించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో తిరు ఆర్యన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, క్రిటికల్ కేర్, ట్రామా కేర్, డెంటల్ తదితర విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
అదనంగా 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఫార్మసీ సౌకర్యాలు, అవసరమైన పరీక్షల కోసం ఆధునిక వైద్య పరికరాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగజ్‌నగర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్యం అందించడంలో ఈ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








