నర్సాపూర్/తూప్రాన్ : ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణ, స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ, వాటి దర్యాప్తు మరియు పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కౌడిపల్లి ఎస్ఐ అమర్‌కు సూచించారు. కేసుల విచారణలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమయపాలనతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను కూడా ఎస్పీ సమీక్షించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ప్రతిరోజూ నిర్వహించాలని ఆదేశించిన ఆయన, ముఖ్యంగా 765డీ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, అతివేగం మరియు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ, ప్రధాన కూడళ్లు, వ్యాపార ప్రాంతాలు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
అదేవిధంగా, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులను వెంటనే స్వీకరించి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ తనిఖీలలో ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్‌రెడ్డి, నర్సాపూర్ సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ అమర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








