చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివునూర్ గ్రామంలో రైతుల పంట పొలాలకు వెళ్లే దారి విషయంలో నెలకొన్న వివాదానికి పరిష్కారం లభించింది. రిపోర్టర్ టీవీలో ప్రసారమైన కథనానికి స్పందించిన ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ శుక్రవారం తన గెస్ట్‌హౌస్‌లో గ్రామ రైతులు, గ్రామస్తులతో సమావేశమై దారి సమస్యపై చర్చించారు.
ఈ సందర్భంగా రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. రైతుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా దారి అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
సమావేశంలో గ్రామ సర్పంచ్ నర్సింలు, ఉపసర్పంచ్ రాములు మాట్లాడుతూ.. రైతుల పొలాలకు వెళ్లే దారిలో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. దారి అభివృద్ధి చేయడంతో రైతులకు మరింత సౌకర్యం కలిగిందని పేర్కొన్నారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని షబ్బీర్ అలీ సొంత ఖర్చులతో దారి నిర్మాణానికి సహకరించారని, తద్వారా రైతులకు మేలు జరిగిందని సర్పంచ్, ఉపసర్పంచ్ తెలిపారు.
అమ్మకుంట, తాతకుంట ప్రాంతాలకు వెళ్లే దారి విషయంలో కూడా గ్రామస్తులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని వారు స్పష్టం చేశారు. గ్రామంలో దారి సమస్యపై నెలకొన్న అపోహలకు సమావేశంతో తెరపడిందని గ్రామస్తులు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు షబ్బీర్ అలీ ముందుకు రావడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.
షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత .. పొలాల రాకపోకలకు అడ్డు గోడ నిర్మాణం








