contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హత్య కేసు ఛేదించిన చేగుంట పోలీసులు.. 9 మంది అరెస్ట్

చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన సూరారం గ్రామానికి చెందిన యువకుడు యాట శ్రీధర్ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. నేరానికి ఉపయోగించిన రెండు ఆటోలు, తొమ్మిది స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. శంకరంపేట్ (ఆర్) మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ (22) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన తుపాకుల శోభ వద్ద ఆటోను అద్దెకు నడిపిన శ్రీధర్, అనంతరం రూ.1.10 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన ఈఎంఐలు తానే చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఈఎంఐల విషయంలో తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినప్పటికీ వివాదం పూర్తిగా సద్దుమణగలేదు.

ఇదే సమయంలో ప్రధాన నిందితుడు రణబోయిన ప్రభు తన రెండో వివాహానికి సంబంధించి కూడా శ్రీధర్ తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడనే అనుమానంతో అతనిపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత పంచాయితీ ఒప్పందం ప్రకారం డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో శ్రీధర్ ఆటోను తిరిగి ఇంటికి తీసుకురావడం వివాదాన్ని మరింత ముదిర్చిందని వెల్లడించారు.

ఈ క్రమంలో జూన్ 22న సాయంత్రం శ్రీధర్ తన మేనల్లుడు ప్రభాకర్‌తో కలిసి బైక్‌పై అనంతసాగర్ గ్రామానికి వెళ్తుండగా, మక్కరాజ్‌పేట బ్రిడ్జి సమీపంలో నిందితులు రెండు ఆటోలతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. శ్రీధర్ బైక్‌ను ఆపకుండా వెళ్లిపోవడంతో అనంతసాగర్ బస్‌స్టాప్ సమీపంలోని శివాజీ విగ్రహం వద్ద ప్రధాన నిందితుడు రణబోయిన ప్రభు తాను నడుపుతున్న ఆటోతో బైక్‌ను వెనుక నుంచి ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడు. దీంతో శ్రీధర్ గాల్లోకి ఎగిరిపడి శివాజీ విగ్రహం సిమెంట్ దిమ్మెకు తల బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న ప్రభాకర్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

మృతుడి తల్లి యాట శ్యామల ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తూప్రాన్ డీఎస్పీ జె. నరేందర్ గౌడ్ పర్యవేక్షణలో రామాయంపేట సీఐ బి. సైదా, చేగుంట ఎస్‌ఐ చైతన్య రెడ్డి, రామాయంపేట ఎస్‌ఐ బాలరాజ్, శంకరంపేట ఎస్‌ఐ శివానందం, నిజాంపేట ఎస్‌ఐ రాజేష్, నార్సింగి ఎస్‌ఐ సృజనతో పాటు సర్కిల్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. జూన్ 24న తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి, నేరానికి ఉపయోగించిన బజాజ్ ఆటో (TG 15 U 5664), నంబర్ ప్లేట్ లేని మరో కొత్త బజాజ్ ఆటో, తొమ్మిది స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈ హత్య కేసును వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :